చట్ట సవరణతో గ్రామాలు మరింత అభివృద్ధి : మహిళా సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు రేణుక.

చట్ట సవరణతో గ్రామాలు మరింత అభివృద్ధి : మహిళా సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు రేణుక.

హైదరాబాద్, వెలుగు: పంచాయతీరాజ్ బిల్లు చట్ట సవరణతో గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని మహిళా సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు గుంటుపల్లి రేణుక తెలిపారు. గ్రామ సర్పంచులకు పూర్తి అధికారాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్ట సవరణను మహిళా సర్పంచుల ఫోరం స్వాగతించింది. ఈ మేరకు శుక్రవారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను వారు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం గ్రామరాజ్య స్ఫూర్తికి నిజమైన అర్థం చేకూరుస్తుందని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలకు పూర్తి అధికారాలు దక్కడం వల్ల స్థానిక సమస్యల పరిష్కారంలో సర్పంచులు మరింత సమర్థవంతంగా వ్యవహరించగలరని వివరించారు. ఈ నిర్ణయం మహిళా సర్పంచులకు మరింత ఊతమిస్తుందని, స్థానిక పాలనలో వారి పాత్రను మరింత బలోపేతం చేస్తుందన్నారు. ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి సీతక్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.